కేంద్రం ప్రకటించిన హాట్‌స్పాట్‌లన్నీ రెడ్‌జోన్ పరిధిలోకి వచ్చేవే. ఈ జాబితాలో ఏపీ నుంచి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. 20కిపైగా కేసులు నమోదైన ప్రతీ జిల్లాను హాట్‌స్పాట్‌గా.. అందులోనూ అత్యధిక కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్ క్లస్టర్లుగా ప్రకటించారు.

ఈ జాబితా ప్రకారం ఈ నెల 20 నుండి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయి. హాట్‌స్పాట్‌లోని కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక బృందాలు డోర్-టు-డోర్ సర్వేను చేపట్టనున్నారు. కోవిడ్-19 పరీక్షలే కాకుండా ఇన్ప్లూయెంజా సంబంధిత పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
‘హాట్స్పాట్లపై ప్రతీ సోమవారం సమీక్ష చేయాలి. వీటి పరిధిలో లేకుండా, రెట్టింపు కేసులు నమోదయ్యే ప్రాంతాలను జాబితాలో చేర్చాలి. ఆరెంజ్ జోన్లో 14రోజుల వ్యవధిలో ఒక్క కేసు నమోదు కాకపోతే అక్కడ కంటైన్మెంట్ ముగిసినట్లే. 28 రోజుల తర్వాత కొత్త కేసులు నమోదు కాకపోతే అది పూర్తిగా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లినట్లుగా భావించాలి’ అని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతీ సుడాన్ తెలిపారు.
దేశంలోని జిల్లాలను మూడు భాగాలుగా కేంద్రం విభజించింది. దేశంలోని మొత్తం 700 జిల్లాలను హాట్‌స్పాట్ జిల్లాలు, హాట్‌స్పాట్‌యేతర జిల్లాలు, గ్రీన్ జోన్ జిల్లాలుగా విభజించింది. దాదాపు 170 జిల్లాలను కరోనా వైరస్ హాట్‌స్పాట్ జిల్లాలకు గుర్తించగా, వాటిల్లో ఏపీలోని 13 జిల్లాల్లో 11 జిల్లాలు ఉండడం గమనార్హం.

అదే పొరుగున ఉన్న తెలంగాణలో కేవలం 8 జిల్లాలు మాత్రమే ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. ఈ జాబితా ప్రకారం తెలంగాణలో వైరస్ మహమ్మారి ఎక్కువగా హైదరాబాద్ నగరం, పరిసరాలకు పరిమితం కాగా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం విశాఖపట్నం నుండి అనంతపూర్ వరకు మొత్తం వ్యాపించింది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశమే.
అంటే ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు గాని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణలో కేవలం 8 జిల్లాలు మాత్రమే ఈ జాబితాలో చోటుచేసుకోవడం గమనార్హం. తెలంగాణలో పాజిటివ్ కేసులలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్భన్, రంగారెడ్డి అర్బన్, గద్వాల, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్ లను హాట్‌స్పాట్ జిల్లాలుగా కేంద్రం ప్రకటించింది.