CoronaVirus_Telugu Idol
CoronaVirus_Telugu Idol

నమ్మితీరాల్సిన నిజం : మన శరీరం సూక్ష్మ జీవుల మయం.
(బాక్టీరియా, వైరస్ ల మయం)

చిన్నప్పుడు స్కూల్లో సూక్ష్మ జీవుల గురించి తెలుసుకున్నప్పటి నుంచి, సూక్ష్మ జీవులన్నీ రోగాలను కలుగజేస్తాయని మనలో కొందరు అపోహ పడుతుంటారు. అసలు విషయం ఏమిటంటే, మన శరీరం మొత్తం దాదాపు 100 ట్రిలియన్ సూక్ష్మ జీవ కణాలకు నిత్య ఆవాస నిలయం. రోగ పీడుతులు కాని అత్యంత ఆరోగ్యవంతుల శరీరంలో కూడా వివిధ అవయవ వ్యవస్థలు సూక్ష్మ జీవులకు ఆవాస కేంద్రాలుగా నిలుస్తున్నాయి.మన చర్మం, కేశములు, రోమములు, రోమ రంధ్రాలు, కేశమూలాలు, ముక్కు, శ్వాశ నాళాలు, నోరు, ప్రేగులు, మర్మావయవాలు, ఇంకా ఇతర అవయవాలు కొన్ని మంచి సూక్ష్మ జీవులను కలిగి ఉండడమే కాకుండా వీటి వలన మనం లబ్దిపోదేలా చేస్తున్నాయి.

మన శరీరంలో నివసిస్తున్న అన్ని సూక్ష్మ జీవులనూ కలిపి హ్యుమన్ “మైక్రో బయోం” అని పిలుస్తాం. సూక్ష్మ జీవుల వలన కలిగే అంటూ వ్యాధులను మన భూమిపై ఉన్న కేవలం అతి కొద్ది శాతం సూక్ష్మ జీవులు మాత్రమే కలుగ జేస్తాయి.ఇప్పటి వరకు భూమి మీద మనకు తెలిసిన అన్ని సూక్ష్మ జీవుల (అంటే- నేల, నీరు, గాలి, చెట్లు మరియు ఇతర జంతువులలో ఉన్నవి) సంఖ్యతో పోల్చితే, వ్యాధి కారక సూక్ష్మ జీవుల సంఖ్య అత్యల్పం. కానీ మానవుని ఉనికికి ప్రమాదం కలిగించే శక్తి ప్రస్తుతం ఈ అతి స్వల్ప సంఖ్యాక వ్యాధి కారక సూక్ష్మ జీవులకు మాత్రమే ఉంది! యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల తరువాత, భారీ ఎత్తున మానవ జన నష్టం కలిగించే సామర్థ్యం కేవలం ఈ వ్యాధి కారక సూక్ష్మ జీవులకు మాత్రమే ఉంది. బాక్టీరియా, వైరస్, ఫంగై (శిలీంధ్రాలు, బూజు), ఆల్గే(నాచు), ప్రోటో జోవన్లను సూక్ష్మ జీవులు అని అంటారు. వీటిని మనం కంటితో నేరుగా చూడలేం. సూక్ష్మ దర్శిని (మైక్రో స్కోప్) వినియోగించి మాత్రమే చూడగలం కాబట్టే వీటిని సూక్ష్మ జీవులు అని పిలుస్తాం.

కింది చిత్రంలో ఎడమ వైపు మన శరీర సహజ రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలు, కుడి వైపు మానవ శరీరం లో సహజం గా జీవిస్తున్న సూక్ష్మ జీవుల ను పెర్కోనడం జరిగింది. మనకు వ్యాధులు సంక్రమించకుండా ఈ మంచి బాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థతో కలిసి పనిచేస్తాయి.

మానవ శరీరం లోకి ఈ సూక్ష్మ జీవులు ఎలా ప్రవేశిస్తాయి? అనే సందేహం తలెత్త వచ్చు. ఇవి మన దేహంలోకి మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే సమయం నుండి జీవితాంతం శ్వాశ క్రియ, నీరు త్రాగడం, ఆహారం, కొన్ని ప్రో-బయోటిక్ ఔషధ సేవనం లాంటి వివిధ సహజ ప్రక్రియల ద్వారా మన దేహము లోనికి ప్రవేశిస్తాయి. బిడ్డ పుడుతున్న సమయంలో తల్లి జననాంగాల నుంచి అనేక రకాల బాక్టీరియాలు మన దేహంలోనికి ప్రవేశిస్తాయి. గర్భిణీ స్త్రీల జననాన్గాలపై ఉన్న సూక్ష్మ జీవులు శిశువు జీర్ణవ్యవస్థలో ఆవాసం ఏర్పరచుకొని (ప్రేవులలో) తల్లి పాలను జీర్ణం చేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఈ సూక్ష్మ జీవుల సంఖ్యా ఇతర స్త్రీల కంటే గర్భిణీ స్త్రీలలో అధికంగా ఉంటుంది. తల్లి పాలను త్రాగుతున్నంత కాలం శిశువు శరీరం కొత్త కొత్త సూక్ష్మ జీవులను తన దేహంలోనికి స్వీకరిస్తూనే ఉంటుంది.

బిడ్డ పెరిగి పెద్దవాడైన తరువాత దేహంలోని సూక్ష్మ జీవుల జనాభాలో చాలా క్లిష్టమైన మార్పులు చేర్పులు జరుగుతాయి. అదే సమయంలో ఈ సూక్ష్మ జీవులు శరీర రోగ నిరోధక వ్యవస్థకు రోగ కారక క్రిములను ఎదుర్కోవడానికి అవసరమయ్యే వివిధ యంత్రాంగాలను పటిష్ట పరచుకోనేలా కూడా చేస్తాయి. మనం పెరిగే వయసులో అతి తక్కువ క్రిములకు మాత్రమే ఎదురు పడితే అంటే, అవసరానికి మించి అతిగా శుచి శుభ్రతలకు అలవాతుపడినా, లేదా అవసరానికి మించి అంటిబయాటిక్ ఔషధాలను వాడడం అలవరచుకున్నా అల్లర్జీలాంటి రుగ్మతల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య శాస్త్ర పరిశాధనలలో తేలింది. అంటిబయాటిక్స్ ను అతిగా వినియోగించడం వలన మన శరీరంలోని మేలు కలిగించే క్రిములను చాలా వరకు నష్ట పోతాం. అందుకనే, ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి డాక్టర్లు అంటి బయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు వాటి తో పాటు ఏదైనా ప్రో-బయోటిక్ పొడిని గానీ, మాత్రలను గానీ వాడమని చెబుతారు. మనం ఈ ప్రోబయోటిక్ మందుల కవర్ పై ముద్రించిన విషయాలను చదివితే ప్రో-బయోటిక్ ఉత్పాదనలో చాలా లాక్టిక్ ఆమ్లాన్ని తయారు చేసే బాక్టీరియాల పేర్లు మనకు కనిపిస్తాయి. ఇవి మన పెద్ద ప్రేగును చేరి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని హాని కారక క్రిముల వలన విరోచనాలు, అతిసార వ్యాధి కలగకుండా కాపాడుతాయి. మనం యోగర్ట్, పెరుగు, మజ్జిగ లాంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోని మంచి సూక్ష్మ జీవుల సమతుల్యతను కాపాడుకోవచ్చు.

మన దేహంలో నివసించే సూక్ష్మ జీవుల వైవిధ్యాన్ని కనిపెట్టడం చాలా కష్టం. న్యూ యార్క్ టైమ్స్ దిన పత్రిక 2012 జూన్ 19వ తేదీ ప్రచురించిన కథనం (http://mobile.nytimes.com/2012/06/19/science/studies-of-human-microbiome-yield-new-insights.html?pagewanted=1&_r=1&referer=) ప్రకారం మానవుని నోటిలో 75 నుంచి 100 జాతుల (స్పీసీస్) సూక్ష్మ జీవులు ఉండవచ్చు. ఒకరి నోటిలో ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు ఇంకొకరి నోటిలో ఉండక పోవచ్చు. మరొక అంచనా ప్రకారం మన నోటిలో ఉన్న సూక్ష్మ జీవుల జాతుల సంఖ్యా దాదాపుగా 5000 ఉండవచ్చు.

మన శరీరంలో బాక్టీరియాతో పాటు వైరస్ లు కూడా ఉన్నాయి. ఈ వైరస్లలో చాలా భాగం మన శరీరంలోని వైరస్లపై పరాన్న జీవులుగా పనిచేస్తుననాయి. అంటే మన శరీరం ఒక సూక్ష్మ జీవ జాలాన్ని కలిగి ఉందన్నమాట. దీన్నే ఆంగ్లంలో ఇకో సిస్టం అంటారు. మనం మన శరీరంలో ఇలాంటి సూక్ష్మ జీవుల ఇకో సిస్టంను కొనసాగిస్తున్నాం. మన మైక్రో బయోం లో దాదాపు నూరు జాతుల ఫంగై కూడా ఉన్నాయట.

అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ సంస్థ ఐదేళ్ల పాటు 80 పరిశోధక సంస్థలకు చెందిన 200 వందలమంది శాస్త్రవేత్తలతో కలిసి 250 మంది వాలంటీర్ల సహజ సూక్ష్మ జీవ జాలం పై హుమన్ మైక్రో బయోం ప్రాజెక్ట్ ను నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగంగా 250 మంది వాలంటీర్ల శరీరాల నుంచి సేకరించిన సూక్ష్మ జీవుల నమూనా ల డి.ఎన్.ఏ సీక్వెన్సింగ్ నిర్వహించారు.
http://www.nature.com/nature/journal/v486/n7402/full/nature11209.html

ఈ అధ్యయనం లో పాల్గొన్న వాలంటీర్లు అందరూ తమకు దేహంలో ఎక్కడా ఎటువంటి సూక్ష్మ జీవ జనిత వ్యాధులు లేవని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొన్న తరువాతనే ఈ అధ్యయనంలో భాగం కావింబడ్డారు. ఈ అధ్యయనం పర్యవసానం ఏమిటంటే భవిష్యత్తులో మన రోగాలకు చికిత్స చేసేముందు వైద్యులు మన శరీరం లోని మైక్రోబయోమ్ని దృష్టి లో ఉంచుకొని వైద్యం చేస్తారు. మార్కెట్ లో లభ్యమవుతున్న చాలా అంటీ బయాటిక్స్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని నయం చేయలేక పోతున్నాయి. దీనికి కారణం రోగ కారక క్రిములు జన్యుపరంగా అంటి బయాటిక్స్ను నిర్వీర్యం చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించు కోవడమే. ఈ ప్రక్రియను అంటి బయాటిక్ రెసిస్టన్స్ అని అంటాం. అంటి బయాటిక్ రెసిస్టన్స్ జన్యువులు పర్యావరణంలో విరివి గా ఒక బాక్టీరియా నుంచి ఇంకొక బాక్టీరియాకు సంక్రమిస్తుండడం వలన విపరీతంగా అంటి బయాటిక్స్ ను తట్టుకోగలిగే రోగ కారక క్రిములు శరవేగంగా తయారై ప్రాణ సంకటం గా సంక్రమిస్తునాయి. హ్యూమన్ మైక్రో బయోంపై శాస్త్రీయ అవగాహన కలగడం వలన అంటీ బయాటిక్స్ లేకుండానే అంటు రోగాలకు చికిత్స చేయడం సులభ తరం కావచ్చు.

చాలా వరకు మనం కేవలం ఒక వ్యక్తిగా పరిగనించబడుతుంటాం. ఇప్పుడు మనలో కొన్ని వేల రకాల సూక్ష్మ జీవులు కూడా బ్రతుకుతున్నాయని తెలుసుకున్న తరువాత మనం ప్రకృతిలో ఒక భాగం అనుకోవాలా? లేదా మనమే ఈ సూక్ష్మ జీవులకు ఆధారభూతమైన ఒక ప్రకృతి అనుకోవాలా? మనం మన కోసం మాత్రమే భోజనం చేస్తున్నామా? లేదా మనకు తెలియకుండా మనలో స్థిర నివాసం ఏర్పరచుకొని మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ మైక్రోస్కోపిక్ జీవ లోకం కోసం బ్రతుకుతున్నామా? విజ్ఞాన శాస్త్ర పురోగతి ఇలాంటి ప్రశ్నలకు మున్ముందు సహేతుకమైన సమాధానాలను అందిస్తుందని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here