Poetry on Migrant Workers
Poetry on Migrant Workers

Poetry on Migrant Workers .. వలస పక్షులం నడిసెల్లి పోతున్నాం!
కంటికి కనపడని అవినీతి తో నిరంతరం దహించుకుపోతున్నాము!

వలస పక్షులం .. నడిసెల్లి పోతున్నాం !!!!
దుఖంతో, కోపంతో, ద్వేషంతో నాగరికత అని నమ్మి వలసబాట పట్టినందుకు,
మా తల్లి పిల్లను వదిలినందుకు,
మీ కల్లిబొల్లి మాటలను నమ్మి వచ్చినందుకు,
నగరాలు అంటే అనాగరికత అని తెలుసుకొని ..అన్నీ సర్దుకుని సాగెల్లి పోతున్నాం !!!!

విద్వేషంతో కడుపులో కుమ్మే మీ కత్తులు, త్రిశూలాల కంటే,
భూమిని చీల్చి అన్నం తీసే మా నాగలి గొప్ప,
ఆడాళ్ళను బజారు సరుకు చేసి గుడ్డలిప్పిన మీ నగరాల కంటే,
బట్ట పుట్టటానికి పత్తి పండించే మా రైతులు గొప్ప,
ఆ బట్టనేసిన మా పల్లె మగ్గాలు గొప్ప,
బడికి పంపినా మా పిల్లలకు పాఠాలు చెప్పని మీ పంతుళ్ళ కంటే,
బతుకు పాఠాలు నేర్పిన మా పల్లెలు గొప్ప,
పేదలను పట్టించుకోని మీ భవనాల కంటే,
కురుస్తున్నా,కూలుతున్నా కడుపులో పెట్టుకునే మా గుడిసె గొప్ప,
మనుషుల్ని చంపే .. మీ మద్యం షాపుల కంటే,
చల్లని కల్లు ఇచ్చే మా తాటి చెట్టు గొప్ప,
మా పల్లె తల్లి గొప్ప,
కనికరం లేని మీ ముఖాన ఖాండ్రించి ఉమ్మేసి కన్నీళ్ళ తోనో, మేం మా పల్లె కెళ్ళి పోతున్నాం !!!!

నడమంతరా సిరి కరెన్సీ బాబుల కండకావరం మేం చూశాం
కానీ, అలాగే మీ గొప్పల తరగతి మందహాసం కూడా మాకు అసహ్యమే!
చీకటి వాడల్లో కిక్కిరిసిఉన్న .. మమ్మల్ని పట్టించుకున్నదెప్పుడు,
మా భుజాల మీదెక్కి పైకి ఎగ బాకాలనే మీయావ తప్ప ..మీరు క్రిందికి చూసిందెప్పుడు,
రోజు మేము చేసే కాయకష్టం తో పట్టే మా బట్టల ఉప్పుచరాలను పట్టించుకొన్నది ఎప్పుడు!!!

వెలుగులు చిమ్మే మీ భవంతులలో స్పృహ లేని పరాన్న జీవుల్లారా వినుకో జగమెరిగిన సత్య వాక్కు ????

మీ పని మనిషి, కావాలి మనిషి, నౌకర్, చాకీర్, డ్రైవరు, కార్మికుడు అన్నిటా సర్వాంతర్యామి మేమే కదా
కానీ మీరు మాకు పనిలేని అరువది దినాల వేతనాలు ఇవ్వలేకపోయారు,
ఇప్పుడు పని ఎలా చేయాలనీ మీ ముసలి కనీరుకి కనికరం చూపేది ఎవరు ?
మీ లెక్కల మతలబు మాకు అర్థం కాదు కానీ,
నిగ్గదీసి అడిగితే నిలువు గుడ్లేయడం తప్ప,
నిలబడి జవాబు చెప్పే నిజాయితీ ఉందా మీకు…
మీ తేజోవితం కానీ అహంకారపు చూపులను అడుగు,
మీ క్యాబిన్ల ముందు ఉన్న మా కలివిడి డెస్క్ ని అడుగు,
మాకు కానిదానిని ముట్టుకోలేదని నిజమెరిగిన మీ భవంతుల గోడలను అడుగు,
మీ అజ్ఞానపు సూచనలకన్నా మా అలుపెరగని కష్టాన్ని అడుగు,
మీ అసమర్దుపు తెలివితేటల్ని అడుగు,
మీ బంగ్లా కింద మా కోసం కట్టే రూముని అడుగు,
మమ్మల్ని మీ సేవలు చేసే యంత్రాలుగా తప్ప, మనుషులుగా చూడరని
కరోనా చెప్పిన నిజం తెలుసుకొని .. కాళ్ళ నొప్పుల తోనో, మేం కదిలెల్లి పోతున్నాం !!!!

మేము చెయ్యని దేమిటి… మీరు చేసిన దేమిటి?
మీ బాగు కోసం మేము కార్చిన చెమట యెంత,
అభివృద్ధి పేరిట మీరు పోసిన విషం యెంత,
మీకోసం మేము కట్టిన భవంతులెన్ని,
మీ ఆనందం కోసం మీరు కూల్చిన గుడిసెలు యెన్ని,
కరెన్సీ నోట్ల వాసన మీకు ఇంపు,
కార్మికుల చమట వాసన మీకు కంపు,
తిండి పెట్టకుండా తరిమేస్తున్న నీతి మీది,
“తినిపో బిడ్డా” అని పిలిచే రీతి మాది,
ఇదేనా మనం కలలు కన్న భారతం..కంటికి కనపడని అవినీతి తో నిరంతరం దహించుకుపోతున్నాము !!!

Poetry on Migrant Workers .. వలస పక్షులం నడిసెల్లి పోతున్నాం ! కంటికి కనపడని అవినీతి తో నిరంతరం దహించుకుపోతున్నాము !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here