కరోనా ఎంట్రీతో దేశంలో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగులు వాయిదాపడగా థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటు కార్మికులంతా ఇళ్లకే పరిమితయ్యారు. థియేటర్లు మూతపడినప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫాంలో సినిమాలు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. దీంతో తమిళ హీరో సూర్య తన భార్య జ్యోతిక నటించిన ‘పోంమగళ్ వందాల’ చిత్రాన్ని డిజిటల్ ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఈ నిర్ణయంపై తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్స్, థియేటర్ నిర్వహాకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం అన్నారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. లాక్డౌన్ వల్ల థియేటర్స్ మూసివెయ్యడంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, థియేటర్స్ నిర్వాహకులు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సూర్య నిర్మించిన చిత్రం ‘పోంమగళ్ వందాల’ డైరెక్టుగా ఓటీటీలో విడుదల కావడాన్ని తమంతా పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
ఇలా చేయడం వల్ల థియేటర్లు మూసివేసే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. హీరో సూర్య తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేనట్లయితే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలన్నీ థియేటర్లలో బ్యాన్ చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఓటీటీలో సినిమాల విడుదల విషయం ప్రస్తుతం తమిళ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టిస్తుంది.