Zoom App Telugu Idol
Zoom App Telugu Idol

జూమ్‌ వీడియో కాల్స్‌ చేసుకునే యాప్‌. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, స్కైప్‌, గూగుల్‌ డుయోల్లో ఎలాగైతే వీడియో కాల్స్‌ చేస్తుంటామె అలాగన్నమాట. అయితే ఇందులో అదనపు ఫీచర్లు చాలా ఉంటాయి. మీ స్క్రీన్‌ షేరింగ్‌, కాల్‌ రికార్డింగ్‌ లాంటివి. అంటే మీ మొబైల్‌ / సిస్టమ్‌లో పీడీఎఫ్‌, డాక్స్‌ను జూమ్‌లో మాట్లాడుతూనే షేర్‌ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌ వెర్షన్‌ను వాడుకోవచ్చు. జూమ్‌లో ఖాతా ప్రారంభించి… మాట్లాడాలనుకునే వ్యక్తికి జూమ్‌ ఐడీ అనే ఆరెంకల నంబరును ఇవ్వాలి. దాంతో అవతలి వ్యక్తి లాగిన్‌ అయ్యి మీతో మాట్లాడొచ్చు. అలా వందమంది వరకు కనెక్ట్‌ అయ్యి మాట్లాడుకోవచ్చు. ఈ యాప్‌ను విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి పాఠశాలలు కూడా వినియోగిస్తున్నాయి.

లాక్‌ డౌన్‌ ముందు వరకు జూమ్‌ గురించి ఐటీ ఉద్యోగులకు, కొంతమంది ఎంఎన్‌సీ సంస్థల ఉద్యోగులకు మాత్రమే తెలుసు. లాక్‌డౌన్‌ తర్వాత జూమ్‌ వినియోగం అమాంతం పెరిగిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేవారు దీనిని ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. కాన్ఫరెన్స్‌, వీడియో క్లాస్‌లు, మీటింగ్‌లు ఇలా అన్నీ జూమ్‌లోకి వచ్చాయి. అప్పుడే ఇందులో డేటా అంత సేఫ్‌ కాదని వార్తలొచ్చాయి. లాగిన్‌ వివరాలు లాంటివి అగంతుకుల చేతిలోకి వెళ్లిపోతున్నాయని సైబర్‌ భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద సంస్థలు దీని వినియోగాన్ని నిషేధించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే దారిలో అధికారులు వాడొద్దంటూ సూచించింది.

”జూమ్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అంత భద్రం కాదు” అంటూ వార్తలొస్తున్న సమయంలోనే ఓ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ బాంబు లాంటి వార్త చెప్పింది. బ్లీపింగ్‌ కంప్యూటర్ అనే సంస్థ చెప్పిన వివరాల ప్రకారం… ఐదు లక్షల మంది జూమ్‌ వినియోగదారుల డేటా లీక్‌ అయ్యింది. నెటిజన్ల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకాలకు పెట్టే డార్క్‌ వెబ్‌లో ఐదు లక్షల మంది జూమ్‌ యూజర్ల డేటా అమ్మకానికి సిద్ధంగా ఉందని బ్లీపింగ్‌ కంప్యూటర్‌ చెప్పింది.

Video App Zoom TeluguIdol
Video App Zoom TeluguIdol

డేటా చౌర్యం గురించి జూమ్‌ యాజమాన్యం స్పందించింది. జూమ్‌ మీద వస్తోన్న ఆరోపణల దృష్ట్యా జూమ్‌ సీఈవో ఎరిక్‌ ఎస్‌ యువాన్‌ ఈ నెల మొదట్లో క్షమాపణలు చెప్పారు. యాప్‌ అప్‌డేట్స్‌ కార్యక్రమాలను పక్కనపెట్టి యాప్/సర్వీసులో భద్రత పెంచే దిశగా పనులు ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని బగ్స్‌ / ఇష్యూలు ఫిక్స్‌ చేసి అప్‌డేట్స్‌ విడుదల చేసింది.

పాస్‌వర్డ్‌ క్రియేషన్‌లో మార్పులు చేసింది. పాస్‌వర్డ్‌ పొడవును పెంచింది. మీటింగ్‌ ఐడీల విషయంలోనూ మార్పులు చేసింది. మీటింగ్‌ ఐడీల్లో క్లిష్టత పెంచి… ఇతరులు అంచనా వేయకుండా చేశామని చెప్పింది. గతంలో 9 అంకెలున్న ఐడీ.. ఇప్పుడు 11 అంకెలకు మార్చింది. కాన్ఫరెన్స్‌ రికార్డింగ్స్‌ను బాక్స్‌, డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌ లాంటి క్లౌడ్‌ సర్వీసుల్లో సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ను డిజేబుల్‌ చేసింది.

జూమ్ కు ప్రత్యామ్నాయంగా చాలా యాప్స్‌ / సర్వీసులు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌ నుంచి టీమ్స్‌, స్లాక్‌, సిస్కో వెబెక్స్‌, టీమ్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌, జోహో లాంటి యాప్ష్‌ / సర్వీసులు ఉన్నాయి. ఇది కాకుండా గూగుల్‌ తన పాత హ్యాంగ్‌అవుట్స్‌ మీట్‌ను ‘గూగుల్‌ మీట్‌’ పేరుతో కొన్ని మార్పులు చేసి తీసుకురాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here